పెద్దపల్లి, జూన్ 5(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూరులోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఇరిగేషన్ భూముల కబ్జా, చెరువుల తవ్వకం వ్యవహారంపై ఇప్పుడిప్పుడే ఫైళ్లు కదులుతున్నాయి. అక్రమంగా చెరువుల తవ్వకం, చేపల పెంపకం తదితర వివరాలతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వరుస కథనాలతో కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో రెండ్రోజుల కింద జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు ఆధ్వర్యంలో ఇరిగేషన్, రెవెన్యూ, మత్స్యశాఖ, వాటర్ గ్రిడ్, హెచ్ఎండబ్ల్యూఎస్, విద్యుత్తు, పోలీసుశాఖల అధికారులు కబ్జాలకు గురైన ఎల్లంపల్లి భూముల్లోని చెరువులు, కోళ్ల వ్యర్థాలతో చేపలను పెంచుతున్న తీరును పరిశీలించారు.
భూములు కబ్జా చేసి చెరువులు తవ్వడం, అందులోని చేపలకు మేతగా కోళ్ల వ్యర్థాలు అందిస్తుండటాన్ని జిల్లా ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఇటీవలే జిల్లా మత్స్యశాఖ అధికారితో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. వ్యర్థాలను చెరువుల్లో వేస్తుండటంతో ఎల్లంపల్లి నీరు కలుషితమవుతున్నదని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి సురేశ్కుమార్నాయుడు గురువారం మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, ఎల్లంపల్లి ఇరిగేషన్ భూముల్లో అక్రమంగా చెరువులను తవ్విన విషయంలో 17మందిపై చర్యలు తీసుకోవాలని ఎల్లంపల్లి ఏఈఈ వాసాల నవీన్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతర్గాం ఎస్ఐ వెంకట్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తమకు అందిన అన్ని ఫిర్యాదులను పరిశీలించి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
అదనపు కలెక్టర్ వేణు ఆదేశాల మేరకు ఎల్లంపల్లి నుంచి చెరువుల్లోకి నీటిని లిఫ్ట్ చేసేందుకు ఏర్పాటు చేసిన 10 హెచ్పీ మోటార్లకు విద్యుత్తు శాఖ అధికారులు కనెక్షన్లు తొలగించారు. చెరువుల వరకు ట్రాన్స్ఫార్మర్ సహా విద్యుత్తు స్తంభాలు, లైన్లు వేయడంపై సమగ్రమైన విచారణ జరిపి, అనుమతులు లేని చెరువులకు విద్యుత్తు సరఫరాకు ఎవరు ఎలా సహకరించారనే విషయమై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఎఫ్టీఎల్లో భూములను ఆక్రమించిన అక్రమార్కులు పరారీలో ఉన్నారు. ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న ప్రత్యేక కథనాలతో పత్తా లేకుండా పోయారు. అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తూ ఏ చెరువు ఎవరిది అని ఆరా తీస్తూ, వారికి ఫోన్లు చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. తమకు అనుకూలమైన వారి ద్వారా ఇక్కడ స్థానికంగా ఏం జరుగుతున్నదనే సమాచారాన్ని తెలుసుకుంటున్నట్టు తెలుస్తున్నది.