హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లోని కళానైపుణ్యాలను వెలికితీసేందుకు నిర్వహించిన జాతీయస్థాయి కళా ఉత్సవాల్లో తెలంగాణ విద్యార్థిని కే శిశిర సత్తాచాటింది. రామాంతాపూర్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న శిశిర బాలికల శాస్త్రీయ నృత్య పోటీల్లో మొదటి బహుమతిని కైవసం చేసుకొన్నది. సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 12 వరకు నిర్వహించిన ఈ పోటీల్లో తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. అద్భుత ప్రదర్శనతో అలరించిన శిశిరను విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రత్యేకంగా అభినందించారు. 2018లో జరిగిన జాతీయస్థాయి కళా ఉత్సవాల్లో వరంగల్ జిల్లాకు చెందిన చిన్నారి మార్గం వైష్ణవి కూడా శాస్త్రీయ నృత్యంలో మొదటి బహుమతిని దక్కించుకొన్నది.