సిద్దిపేట, జనవరి 31: తెలంగాణలో మొదటి గిలియన్ బరే సిండ్రోమ్ కేసు నమోదైంది. సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లికి చెందిన గుర్రం గ్రీష్మకు జనవరి 17న ఎడమచేతికి నొప్పిరావడంతో సిద్దిపేట న్యూరో దవాఖానకు తరలించారు. ఎమ్మారై సాన్ చేయడంతో అన్నీ నార్మల్‌గా వచ్చాయి. గిలియన్ బరే సిండ్రోమ్ వ్యాధి లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వైద్యులు గ్రీష్మను హైదరాబాద్‌లోని మల్లారెడ్డి దవాఖానకు తరలించారు. జనవరి 20న రెండు కాళ్లకు, 24న లంగ్స్‌కు వ్యాధి సోకడంతో అక్కడినుంచి కిమ్స్ దవాఖానకు తరలించారు. పరీక్షించిన కిమ్స్ వైద్యులు జీబీఎస్ వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. గ్రీష్మకు ఇద్దరు అబ్బాయిలు, రెండు నెలల కూతురు ఉన్నారు.
మేల్కొనని సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
ఒకవైపు కుటుంబ సభ్యులు, స్థానికులు జీబీఎస్ వ్యాధితో గ్రీష్మ చికిత్స పొందుతున్నదని చెబుతుంటే, సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాత్రం వ్యాధి నిర్ధారణ కాలేదని, తమకు అలాంటి రోగ నిర్ధారణ శాంపిల్స్ రాలేదని చెబుతున్నారు. కిమ్స్ వైద్యులు దవాఖాన లెటర్ ప్యాడ్‌పై గ్రీష్మ జీబీఎస్ వ్యాధితో బాధపడుతున్నదని నిర్ధారిస్తే, సిద్దిపేట ప్రభుత్వ వైద్య అధికారులు మాత్రం ఇంకా నిర్ధారించలేదు. దీనిపై జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి పల్వన్‌కుమార్ వివరణ కోరగా.. ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదని, వందలో ఒకరిద్దరికి మాత్రమే జెనెటిక్ లోపంతో వస్తుందని చెప్పారు.