హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): విల్లాలు నిర్మిస్తామని భారీగా అడ్వాన్స్‌లు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టకపోగా, ఆ స్థలం వాళ్లది కాదని తెలిసి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 17ఎకరాల్లో విల్లాలు నిర్మిస్తామని కస్టమర్ల నుంచి రూ.15 కోట్లు వసూలు చేసిన రియల్ ఎస్టేట్ నిర్వాహకులపై బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అమీర్‌పేట్‌కు చెందిన భవిష్య రియల్టర్స్ బాబురావు, శేఖర్‌రావు, వెంకటరమణారావు, బంజారాహిల్స్‌కు చెందిన ఎన్ఎస్ఏ అవెన్యూ నిర్వాహకులు కోనేరు వెంకటవినయ్ కలిసి మహేశ్వరం మండలం గొల్లూరు పరిధిలో 17ఎకరాల్లో విల్లాలు నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.
విషయం తెలుసుకున్న దూలపల్లికి చెందిన సురభి అశోక్‌రావు తన స్నేహితులు, బంధువులు కలిసి భవిష్య రియల్టర్స్‌ను కలిసి విల్లాలపై ఆరా తీశారు. ఒక్కో విల్లా రూ.1.70కోట్లని, 450 గజాల్లో 4,250 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తామని చెప్పారు. దీంతో జనవరి 1, 2023న లక్ష బయనా ఇచ్చి, సంవత్సరంలోపు రూ.50 లక్షలు చెల్లించారు. మూడేండ్లలో విల్లా నిర్మింలా ఒప్పందం చేసుకున్నారు. 6 నెలల తర్వాత బాధితులు విల్లాలపై ఆరా తీశారు. తమకు చూపించిన స్థలం బిల్డర్లది కాదని తెలుసుకున్నారు. స్థలం అసలు యజమానిని సంప్రదించగా..సర్వే నంబర్ 144 నుంచి 159,163,168 నిషేధిత జాబితాలో ఉన్నట్టు గుర్తించారు. రూ.15కోట్లు వసూలు చేసి మోసం చేశారని బాధితులు నిర్వాహకులపై ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు.
బంజారాహిల్స్‌కు చెందిన ఆత్రేయ రియల్ ఇన్ఫ్రా నిర్వాహకుడు ఎం శ్రీనివాసవర్మ, నిజామాబాద్‌కు చెందిన వైద్యుడు అప్సింగీకర్ రాఘవేంద్రకు పరిచయమయ్యాడు. తమకు సదాశివపేట్‌లో 2.10 గుంటల స్థలం ఉందని, అందులో విల్లాలు నిర్మిస్తున్నానని నమ్మించాడు. వైద్యుడు తన భార్య పేరుపై 1300 గజాలు కొనేందుకు అగ్రిమెంట్ చేసుకొని రూ.80 లక్షలు చెల్లించాడు. బ్యాలెన్స్ చెల్లిస్తామని రిజిస్ట్రేషన్ చేయాలని బిల్డర్‌ను కోరుతున్నా వాయిదా వేస్తూ వచ్చాడు. దీనిపై ఆరా తీయగా చాలా మందిని మోసం చేశాడని, మాదాపూర్ పీఎస్‌లో కేసులున్నట్టు తెలుసుకున్నాడు. దీంతో వైద్యుడు సీసీఎస్‌లో ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు.