హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): మంటలకు ఎదురెళ్లి ప్రజల ప్రాణాలను కాపాడటమే కాదు.. వానకాలంలో వచ్చే వరదలను సైతం ఎదురీది పౌరుల ప్రాణాలు కాపాడేందుకు తెలంగాణ అగ్నిమాపక శాఖ సిద్ధమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హోంగార్డు నుంచి డీఎఫ్వో స్థాయి వరకు సుమారు 210 మంది సిబ్బందిని రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం చేశారు.
ఇందుకోసం ప్రత్యేకంగా 13 బోట్లను తెలంగాణ అగ్నిమాపకశాఖ అందుబాటులో ఉంచింది. మొత్తం 210 మంది సిబ్బందిలో నలుగురు డీఎఫ్వోలు, 11 మంది ఏడీఎఫ్వోలు, 27 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 168 మంది లీడింగ్ ఫైర్ మన్, ఫైర్ మన్, హోంగార్డులు ఉన్నారు.