హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : తిరుపతి రైల్వేస్టేషన్లో హిసార్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి ఓ బోగీ పూర్తిగా కాలిపోయిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. రాజస్థాన్ నుంచి హిసార్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్‌కు సోమవారం ఉదయం 11.50లకు చేరుకుంది. ప్రయాణికులు స్టేషన్లో దిగిన తర్వాత.. రైలు యార్డులోకి వెళ్లే క్రమంలో ఇంజిన్ వైపు ఉన్న బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అదే సమయంలో పక్క ట్రాక్‌పై ఉన్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ జనరేటర్ బోగీలోకి మంటలు వ్యాపించాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.