నర్సాపూర్, నవంబర్ 19: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ శివారు లచ్చిరాం తండా భూవివాదంలో చనిపోయిన వ్యక్తిపై స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల తీరుపై తండావాసులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తండాలోని 200 సర్వేనెంబర్ భూమి విషయంలో కొన్నేండ్లుగా తండావాసుల మధ్య వివాదం నడుస్తున్నది. రెండు నెలల క్రితం తండా కు చెందిన దేవ్‌సింగ్, సూర్య, ఆంజనేయులు, విఠల్పై ఇంకోవర్గం వ్యక్తులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పాత్లోత్ విఠల్ అనే వ్యక్తి ఏడేండ్ల క్రితం చనిపోయాడు. ఎలాంటి విచారణ చేపట్టకుండా అతనిపై ఏ4 ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. చనిపోయిన వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్లో ఎలా చేర్చుతారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.
భూవివాదంలో పోలీసులు తమ ప్రత్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తూ పూర్తి వివరాలు తెలుసుకోకుండా కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేశారని బాధితుడు దేవ్‌సింగ్ ఆరోపించాడు. ఈ విషయంపై ఎస్సై లింగంను వివరణ కోరగా.. కేసు విషయంలో ఫిర్యాదుదారు లు పది మందిపై ఫిర్యాదు చేశారని, అం దులో విఠల్ అనే వ్యక్తి పేరు ఉందని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణ చేపట్టామని, విచారణకు వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు విఠల్ ఇంట్లో లేడని, బయటకు వెళ్లాడని కుటుంబసభ్యులు చెప్పారనని వివరించారు. విఠల్ చనిపోయాడని విచారణలో తేలిందని, డెత్ సర్టిఫికెట్ సేకరించామని, పేరు తొలిగించి చార్జీషీటు వేస్తామని ఎస్సై పేర్కొన్నారు.