హైదరాబాద్, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఆ బియ్యాన్ని సమకూర్చడంపై పౌరసరఫరాల శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం పంపిణీకి ఏటా 24 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఇంత భారీ మొత్తంలో సన్న బియ్యం సేకరించడం ఇప్పుడు అధికారులకు సవాలుగా మారింది.
ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అక్టోబర్ చివర్లో మొదలై ఫిబ్రవరి వరకు కొనసాగనున్నది. దీంతో జనవరి నాటికి సన్న బియ్యం అందడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్, మే నెలకు గానీ ఈ బియ్యం అందుబాటులోకి రావని అధికారులు చెప్తున్నారు. అప్పటివరకు అవసరమైన బియ్యాన్ని ఏ విధంగా సమకూర్చాలన్నదానిపై తర్జనభర్జన పడుతున్నారు.
రాష్ట్రంలో ఏటా 24 లక్షల టన్నుల సన్న బియ్యం సేకరణకు దాదాపు 36 లక్షల టన్నుల సన్న ధాన్యం అవసరమవుతుందని సివిల్ సైప్లె అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇంత భారీ మొత్తంలో సన్న ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏటా రెండు సీజన్లలో కలిపి గరిష్ఠంగా 35-40 లక్షల టన్నుల సన్న ధాన్యం మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. ఇందులో అధిక భాగాన్ని రైతులు బహిరంగ మార్కెట్లో విక్రయించి, మిగిలిన ధాన్యాన్ని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు మహా అయితే 3-5 లక్షల టన్నుల సన్న ధాన్యం మాత్రమే వస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.
ప్రస్తుత సీజన్ నుంచి ప్రభుత్వం సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించినందున ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు అదనంగా మరో 10-15 లక్షల టన్నుల సన్న ధాన్యం వచ్చే అవకాశం ఉన్నది. ఈ లెక్కన రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు ఇంకా 15-20 లక్షల టన్నుల సన్న ధాన్యం తక్కువ అవుతుంది. ఇంత మొత్తాన్ని టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తే పౌరసరఫరాల శాఖపై భారీగా ఆర్థిక భారం పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో, లోటును ఎలా పూడ్చాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.