MD Sania | రామన్నపేట, అక్టోబర్ 27 : నీట్లో ఉత్తమ ర్యాంకుతో ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని చదువుకు ఆర్ధిక అవసరాలు ఆటంకాలుగా మారాయి. చిన్నతనం నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకున్న ఆమెకు ఇప్పుడు హాస్టల్ ఫీజు, మెస్ చార్జీలు వంటి ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె తల్లిదండ్రులు ట్యూషన్ ఫీజు వరకు చెల్లించగలిగినా మిగతా ఖర్చులకు ఆర్ధిక పరిస్థితి సహకరించక కుమిలిపోతూ.. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఎండీ సానియా మొదటి ప్రయత్నంలోనే నీట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుని మెడిసిన్‌లో సీటు సంపాదించింది. ఆమె తండ్రి ఎండీ జహంగీర్ ఇంటి వద్దే కిరాణా దుకాణం నడిపిస్తుండగా, తల్లి నస్రీన్సుల్తానా టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారి కుమార్తెలు, ఒక కుమారుడు కాగా, సానియా పెద్దకూతురు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి వరకు చదివి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి జనంపల్లి గురుకుల పాఠశాలలో సీటు సాధించి అక్కడే 10వ తరగతి పూర్తి చేసింది.
ఇంటర్మీడియట్ గౌలిదొడ్డి కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చదివింది. ఈ ఏడాది జరిగిన నీట్‌కు హాజరై మొదటి ప్రయత్నంలోనే ఉత్తమ ర్యాంకు సాధించింది. ఇటీవల నిర్వహించిన కౌన్సిలింగ్లో భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటును సాధించింది. తల్లితండ్రులు అతికష్టం మీద 30వేల రూపాయల ట్యూషన్ ఫీజును చెల్లించగలిగారు. హాస్టల్, మెస్ ఫీజు, స్టడీ మెటీరియల్ వంటివి ఖర్చులకు ఆర్ధిక స్థోమత సహకరించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ముందుకువచ్చి తమ కూతురు చదువుకు సాయం కోరుతున్నారు. దాతలు జహంగీర్ ఫోన్ నెంబర్ 95539 92652కు కాల్ ఆర్థిక సాయం చేయవచ్చు.