సూర్యాపేట టౌన్/సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 18 : మూడు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించే దారిలేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన వసీం అక్తర్ ఖాన్ (43) అదే గ్రామానికి చెందిన ఫౌజియా బేగం అలియాస్ రజినీని 15 ఏండ్ల కింద మతాంతర వివాహం చేసుకున్నాడు.
నాలుగేండ్లుగా సూర్యాపేట ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఫౌజియా బేగం కూడా ఇదే వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. సూర్యాపేట ఇందిమ్మకాలనీ ఫేజ్- 1లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. మూడు నెలలుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించక పోవడంతో భార్యాభర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చేతిలో చిల్లిగవ్వలేక పోవడంతో తినడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వసీం శనివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. ప్రస్తుతం సూర్యాపేట జనరల్ వైద్యశాలలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీని మార్చేందుకు అధికారులు ప్రయత్నించినా కోర్టుకు వెళ్లి మరో ఏడాది పాటు కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నట్టు తెలిసింది. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడం వల్ల మనోవేదనతోనే వసీం ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు చెప్తున్నారు. భార్య ఫౌజియా బేగం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపారు.
‘డియర్ రజినీ నన్ను క్షమించు..’
ఆత్మహత్యకు ముందు వసీమ్ తన భార్యకు లేఖ రాసి గదిలో పెట్టాడు. ‘డియర్ రజనీ.. నన్ను క్షమించు.. నిన్ను ఎంతో బాధపెట్టాను. ఏదో సాధించాలనుకున్నా కానీ సాధ్యం కాలేదు’ అని లేఖలో పేర్కొన్నాడు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్లో వసీమ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి : కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
వసీం ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సర్వేల్ గ్రామానికి వెళ్లి వసీం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు.
అనంతరం మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నదని, వాస్తవ పరిస్థితులు అలా లేవని, సమయానికి వేతనాలు రాక చిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వసీం కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ కేవీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాంబాబు యాదవ్, జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, మండల కన్వీనర్ నర్రి నరసింహ ఉన్నారు.
ఈ పాపం ఎవరిది?
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట వైద్యశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్యకు బాధ్యులెవరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మూడు నెలలుగా ప్రభు త్వం జీతాలు చెల్లించకపోవడంతో వసీం ఆర్థిక ఇబ్బందుల పాలై మనస్తాపంతో ఉరేసుకొని చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆదివారం ఎక్స్‌వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు.
వసీంకు ముగ్గురు ఆడపిల్లలున్నారని, వారికి ఆరోగ్యం సరిగా లేక అవస్థలు పడుతున్నారని, ఇందుకు కారణం సర్కార్ కాదా? అని నిలదీశారు. పిల్లలను కనీసం దవాఖానలో చూపిద్దామంటే చిల్లిగవ్వ లేని దుస్థితి వల్లే వసీం ఆత్మహత్యకు పాల్పడ్డాడని కేటీఆర్ పేర్కొన్నారు. వసీం భార్య కూడా అదే వైద్యశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అని, ఒకటో తారీఖునే జీతాలిస్తున్నామని పేర్కొనే సర్కార్ డొల్లతనానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.