సిద్దిపేట, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వర లో భర్తీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఉపాధ్యాయ పదోన్నతులతోపాటు డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో పోస్టు లు, ఇతర ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు. విద్యా సంవత్సరానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని చెప్పారు. మంగళవారం సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, అధికారులు హాజరయ్యారు. అంతకుముందు మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా సిద్దిపేట శివారులో రైల్వే ట్రాక్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జడ్పీ సమావేశంలో జరిగిన వివిధ శాఖలపై చర్చలో మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాకలో నిర్మించిన సీఎం కేసీఆర్ బడిని త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని, ప్రహరీ, ఇతర పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
సిద్దిపేట రైల్వే కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని మంత్రి తెలిపారు. మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే ఏర్పాటుకు కావాల్సిన మొత్తం భూసేకరణ, అయ్యే మొత్తం ఖర్చులో మూడోవంతు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదని, అగ్రిమెంట్‌కు అనుగుణంగా ఇప్పటికే రూ.500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్పటికే ఫేజ్-1 ద్వారా హైదరాబాద్ నుంచి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ వరకు 44 కిలోమీటర్ల రైలు సేవలు ప్రారంభమై రాకపోకలు సాగిస్తున్నదని చెప్పారు. ఫేజ్ -2 ద్వారా గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో ఉపాధిహామీ పథకంలో నిర్మించిన రైతు కల్లాల డబ్బులు రూ.150 కోట్లు తిరిగి ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేచీ పెడుతున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ డబ్బులు తిరిగిస్తేనే ఇతర బిల్లులు చెల్లిస్తామని బెట్టు చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ రైతు సంక్షేమానికి కృషి చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ఎరువులు దొరక్క క్యూలైన్లో నిలబడిన ఏడుగురు రైతులు మరణించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో గత ఎనిమిదేండ్లుగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నట్టు తెలిపారు.