వికారాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉంటారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరిలో రూ.15 కోట్లతో ఆయుష్ దవాఖాన, రూ.3.50 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోరేజీ నిర్మాణాలకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మర్పల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఇక్కడి పథకాలు పక్కనే ఉన్న కర్ణాటకలో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు.
కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను మంజూరుచేస్తే తెలంగాణకు ఒక్కటీ కేటాయించలేదని చెప్పారు. ప్రతిపక్షాలు ‘అతి’పక్షాలు అయ్యాయని, అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు. రైతుబంధు, 24 గంటల కరెంట్, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ తదితర పథకాలు కొనసాగాలంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మూడోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.