సిద్దిపేట, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పచ్చి అబద్ధాలు వల్లె వేశారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. నడ్డా అబద్ధాల కోరు.. ఆయన అబద్ధాలకు అంతే లేదని ధ్వజమెత్తారు. ‘తెలంగాణ ఒక చైతన్య ప్రాంతం.. ఉద్యమాల గడ్డ. నడ్డా మాట్లాడే ఝూటా మాటలను తెలంగాణ సమాజం సహించదు.
పోదామా? ఎవరొస్తారో రండి.. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులు అవుతున్నాయా? లేదా? చుద్దాం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వస్తే బీబీ నగర్ ఎయిమ్స్‌కు పోదాం.. వరంగల్ దవాఖానకు పోదాం తేడాలు చూపిస్తా’ అని హరీశ్ రావు సవాల్ విసిరారు. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని సుడా పార్కులో నెలకొల్పిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, ఫారూఖ్‌హుస్సేన్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఆవిష్కరించారు.
అనంతరం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీబీనగర్ ఎయిమ్స్‌లో చదువుతున్న వైద్య విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతున్నదని ఆరోపించారు. ఎయిమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమి, రూ.200 కోట్ల విలువైన భవనం ఇచ్చి మూడేండ్లయినా తట్టెడు మట్టి కూడా తవ్వలేదని విమర్శించారు. బీజేపీ నేతలకు పనులు చేతకాదు కానీ.. అబద్ధాలతో ప్రజలను గోల్మాల్ చేయటం బాగా తెలుసని ఎద్దేవా చేశారు.
బీజేపీ ప్రభుత్వం ఉన్నవి రద్దు చేయడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో హ్యాండ్లూమ్ బోర్డు ఏర్పాటు చేస్తే.. బీజేపీ ప్రభుత్వం రాగానే రద్దు చేసి చేనేత రంగాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు. ‘బీజేపీ సర్కారు హ్యాండీక్రాఫ్ట్ బోర్డును రద్దు చేసింది. పవర్లూమ్ బోర్డును, ఎనిమిది పరిశోధన సంస్థలను రద్దు చేసింది. త్రిఫ్ట్ పథకాన్ని రద్దు చేసింది.
లాబార్డ్ బీమా పథకాన్ని కూడా రద్దు చేసింది’ అని గుర్తుచేశారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మంత్రి పదవికి కొండాలక్ష్మణ్ బాపూజీ రాజీనామా చేస్తే, మలిదశ ఉద్యమంలో మంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారని గుర్తుచేశారు. బాపూజీ త్యాగా లు భవిష్యత్తు తరాలకు తెలియాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి చేనేత బీమా వయస్సు సడలింపు గురించి చర్చిస్తానని హామీ ఇచ్చారు.
బీజేపీ నాయకులు కండ్లు ఉండీ చూడలేక పోతున్నారని, చెవులుండీ వినలేకపోతున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. వారిని చరిత్ర క్షమించదన్నారు. ‘వరంగల్‌లో జైలు కూలగొట్టారని, దవాఖాన పనులు ఏమైనయి అని జేపీ నడ్డా వరంగల్ సభలో ప్రశ్నించారు. జైలు కూలగొట్టి మూడు నెలలు కూడా కాలేదు.
అక్కడ ఇప్పటికే 15 శాతం దవాఖాన నిర్మాణ పనులు పూర్తి చేశాం. 24 అంతస్తుల భవనం, రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులు జెట్ స్పీడుగా నడుస్తున్నాయి. మరి మీరు ఏపాటి పని చేశారు. దేశంలో బీజేపీ సర్కారు 150 కొత్త మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇది మీ వివక్ష కాదా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.