హైదరాబాద్, జనవరి29 (నమస్తే తెలంగాణ) : సమగ్ర ఇంటింటి సర్వేకు సంబంధించిన తుది నివేదికను ఫిబ్రవరి రెండో తేదీలోగా క్యాబినెట్ సబ్‌కమిటీకి అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రణాళిక విభాగం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేని నిర్వహించిన విషయం తెలిసిందే. సదరు సర్వే నివేదిక తదితర అంశాలపై సీఎం బుధవారం ప్రత్యేకంగా సమీక్షించారు. రాష్ట్రంలో 1.16 కోట్ల కుటుంబాల ను సర్వేలో గుర్తించామని, దాదాపు 96 శాతానికి పైగా కుటుంబాల వివరాలను సేకరించామని ప్రణాళిక విభాగం అధికారులు సీఎంకి వివరించారు.
కొన్ని కుటుంబాలు సర్వేకు నిరాకరించటం, ఇండ్లకు తాళాలు ఉండటం తదితర కారణాలతో కొందరి వివరాలను సేకరించలేదని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కులగణన ప్రక్రియ సామాజిక సాధికారతతోపాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీనవర్గాల వారందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని తెలిపారు. సర్వే డాటా ఎంట్రీ పూర్తయిన నేపథ్యంలో ఫిబ్రవరి 2వ తేదీలోగా క్యాబినెట్ సబ్‌కమిటీకి తుది నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి వికమార, మంత్రులు దామోదర, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక, పొంగులేటి, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.