హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్సులకు తుది విడత సీట్ల కేటాయింపు శుక్రవారం జరిగింది. తుది విడత వరకు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు 60,214 ఇంజినీరింగ్ సీట్లను కేటాయించారు. ఇంజినీరింగ్ విభాగంలో 59,993 సీట్లు భర్తీ కాగా, 19,797 సీట్లు మిగిలాయి. ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ అభ్యర్థుల కోటాకు స్పందన కరువైంది. 4,426 బీ ఫార్మసీ, ఫార్మ్ డీ సీట్లలో కేవలం 221 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. తుది విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15 లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 15 ఇంజినీరింగ్ కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
ఇంజినీరింగ్‌లో ఐటీ కోర్సులకు భారీ స్పందన లభించింది. ఐటీ కోర్సుల్లో 90 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్ఈలో 95.98 శాతం, ఐటీలో 94.13 శాతం, సీఎస్ఈ(ఏఐ, ఎంఎల్)లో 85.68 శాతం, డేటా సైన్స్‌లో 91.52 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సులకు ఆదరణ తగ్గింది. మెకానికల్‌లో 32.57 శాతం, సివిల్‌లో 41.87 శాతం, ఈఈఈలో 46.14 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.