హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్టు సినీ నటుడు సుమన్ వెల్లడించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి తన మద్దతు ఇస్తానని చెప్పారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్పలో గురువారం జరిగిన ఓ కార్యక్రమానికి సుమన్ హాజరయ్యారు. కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడు సత్తినేని శ్రీనివాస తాతాజీ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ వెళితే న్యూయా ర్క్ వెళ్లామా? అనిపించిందని ఇటీవల రజనీకాం త్ కొనియాడడంలో తప్పు లేదని అన్నారు. హైదరాబాద్‌ను భారత రాష్ట్ర సమితి అభివృద్ధి చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రతి ఏడాది వర్షాలు కురుస్తుంటాయని, విపత్తులు కూడా వస్తుంటాయని, ప్రభుత్వాలే ఆ దిశగా ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతులు కోరేది కొంచెమేనని, ఏ ప్రభుత్వమై నా వారి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తప్పుపట్టాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.