హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ‘ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయండి. రెండున్నరేండ్లుగా కండ్లుకాసేలా ఎదురుచూస్తున్న పేద, మధ్య తరగతి ఉద్యోగార్థులకు న్యాయం చేయండి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగార్థుల తరఫున శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాశారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. రెండున్నరేండ్లు దాటినా అమల్లో విఫలమైందని మండిపడ్డారు. రెండున్నరేండ్లుగా అర్థికంగా కష్టనష్టాలకు ఓర్చి, రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతూ మైదానాల్లో పరుగులు పెడుతున్న పోలీసు ఉద్యోగార్థుల కష్టాలు, కన్నీళ్లను లేఖలో ప్రస్తావించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ ఉద్యమ నినాదం’ అని గుర్తుచేశారు. కానీ కొద్దిరోజులుగా ఖాళీ పోస్టులు అన్నింటినీ భర్తీ చేయాలని పోరాడుతున్న పోలీసు ఉద్యోగార్థుల డిమాండ్లను సర్కార్ పెడచెవిన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేవలం 5 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సిద్ధమయ్యేవారు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి వారే ఉంటారని పేర్కొన్నారు. ఏండ్లకేండ్లుగా తల్లిదండ్రులకు దూరంగా అద్దె గదులు, హాస్టళ్లలో ఉంటూ రాత్రింబవళ్లు కష్టపడుతున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. అష్టకష్టాలు పడుతూ పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న పేద, మధ్య తరగతి బిడ్డల ఆశలపై నీళ్లు చల్లవద్దని కోరారు. వారికి న్యాయం చేయాల్సిన బాధ్య త కాంగ్రెస్ సర్కార్‌పై ఉన్నదని హితవుపలికారు. 17,000 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్టీఐ ద్వారా బహిర్గతమైందని, 12,000 ఖాళీలు ఉన్నట్టు పలుమార్లు సీఎం, మంత్రులు ప్రకటనలు చేశారని గుర్తుచేశారు. కానీ కేవలం 5 వేల ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇది పోలీస్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న 15 లక్షల మంది నిరుద్యోగులను నిండా ముంచడమేన ని ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్కార్ నిర్లిప్త వైఖరికి నిరసనగా దిల్సుఖ్నగర్, అశోక్‌నగర్ లా ంటి ప్రాంతాల్లో నిత్యం నిరుద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
వయోపరిమితి సడలించాలి
ఈ సందర్భంగా ఉద్యోగార్థుల న్యాయమైన డిమాండ్లను కేటీఆర్ ముఖ్యమంత్రి ముందుపెట్టారు. ’15 లక్షల మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నరు. కేవలం 5,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే వారికి తీవ్ర అన్యాయం జరుగుతది. ఈ పరిస్థితుల్లో 20,000 ఖాళీలతో నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రస్తుత జీవో నంబర్ 87 ప్రకారం ఎస్సై అభ్యర్థులకు 35 ఏండ్లు, కానిస్టేబుల్ అభ్యర్థులకు 32 ఏండ్ల వయోపరిమితి విధించారు. కానీ పోలీస్ నోటిఫికేషన్లు విడుదలై నాలుగేండ్లు గడుస్తున్నందున వయోపరిమితిని సడలించాల్సిన అవసరం ఉన్నది. లక్షలాది మంది అభ్యర్థులకు సడలింపు అత్యంత కీలకం. కానిస్టేబుల్ అభ్యర్థులకు 36 ఏండ్లు, ఎస్సై అభ్యర్థుల వయోపరిమితి 37 ఏండ్లకు పెంచాలి. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఒకే రకమైన ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. 35 ఏండ్ల వయస్సు కలిగిన అభ్యర్థి ఎస్సై పోస్టుకు శారీరకంగా అర్హత సాధించినప్పుడు, అదే 35 ఏండ్ల కానిస్టేబుల్ అభ్యర్థికి అవకాశం నిరాకరించడం సరికాదు. ఈ నేపథ్యంలో వయోపరిమితి పెంపు శ్రేయస్కరం’అని లేఖలో ప్రస్తావించారు. లేదంటే నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ పోరాడి మొద్దునిద్ర నటిస్తున్న సర్కార్ కండ్లు తెరిపిస్తుందని ప్రకటించారు.
హామీ ఇవ్వకున్నా 47,000 పోస్టులు భర్తీ చేసినం
బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి హామీ ఇవ్వకున్నా 47,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. కొత్త రాష్ట్రంలో బాలారిష్టాలను అధిగమించి 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1,60,000కు పైగా భర్తీ చేశామని వెల్లడించారు. 2016లో 9,281 కానిస్టేబుల్, 539 ఎస్సై ఉద్యోగాలు, 2018లో 18,428 కానిస్టేబుల్, 1271 ఎస్సై ఉద్యోగాలు, 2022లో 16,614 కానిస్టేబుల్, 554 ఎస్సై ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. 95 శాతం లోకల్ రిజర్వేషన్లు సాధించి యువతకు మేలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎన్నికల ముందు ఓట్ల కోసం యూత్ డిక్లరేషన్ పేరిట హామీలు గుప్పించి ఇప్పుడు మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. గద్దెనెక్కి రెండున్నరేండ్లు దాటినా కేవలం 17,000 ఉద్యోగాలనే భర్తీ చేసిందని విమర్శించారు. నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి ఇస్తామనే హామీని గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో నియామకాలు పూర్తిచేసిన 50,000 ఉద్యోగాల క్రెడిట్ కొట్టేసేందుకు కొత్త నాటకానికి తెరలేపిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి నియామకాలపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.