నర్సంపేట, జూలై 6: వరంగల్‌లో ప్రధాని మోదీ పర్యటనకు ముందే బీజేపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలోని బీజేపీ కార్యాలయంపై గురువారం సొంత పార్టీ నాయకులు దాడి చేసి అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేశారు. ఇదంతా పార్టీ పర్యవేక్షకుడిగా వచ్చిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఎదుటే జరిగింది. శనివారం మోదీ వరంగల్ పర్యటనను విజయవంతం చేసేందుకు నర్సంపేటకు పార్టీ పర్యవేక్షకుడిగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని నియమించారు. నర్సంపేట బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమక్షంలో పార్టీ అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ సమయంలో గోగుల రాణా ప్రతాప్‌రెడ్డి వర్గం నాయకులు వచ్చి జితేందర్‌రెడ్డితో మాట్లాడారు. ‘రేవూరి ప్రకాశ్‌రెడ్డి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఈ మీటింగ్ గురించి కూడా తెలియదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధానం చెప్పేలోపే ప్రతాప్‌రెడ్డి అనుచరులు కుర్చీలు ధ్వంసం చేసి, అద్దాలను పగులగొట్టారు. గొడవ ముదరడంతో గెస్ట్‌హౌస్‌కు రండి అంటూ జితేందర్‌రెడ్డి వెళ్లబోగా.. ‘మేమెందుకు అక్కడి వస్తాం, ఇక్కడే చెప్పాలి’ అంటూ కార్యకర్తలు వీరంగం చేయడంతో అక్కడున్న రేవూరి వర్గీయులు ఎదురు చెప్పకుండా ప్రేక్షకపాత్ర పోషించారు.