పోచమ్మమైదాన్, డిసెంబర్ 22: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉరితాడుగా మారిన సీపీఎస్‌ను అంతం చేసి, పాత పెన్షన్ అమలు కోసం పోరాటం చేయాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్మితప్రజ్ఞ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో ఆదివారం వరంగల్ ఇస్లామియా కళాశాల మైదానంలో ‘కాకతీ కదనభేరి’ని నిర్వహించారు. రాష్ట్ర కంట్రిబ్యూటరీ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కందుల జీవన్‌కుమార్ అధ్యక్షతన నిర్వహిచిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా స్మితప్రజ్ఞతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, కోశాధికారి ఈడిగి నరేశ్‌గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్మితప్రజ్ఞ మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1న సీపీఎస్ ప్రవేశపెట్టినప్పుడు నాటి సంఘాలు ప్రతిఘటించకపోవడంతోనే కొత్త విధానాన్ని అమలు చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025 నుంచి యూపీఎస్ అమలు చేసేందుకు నోటిఫైడ్ చేసినందున అందరూ ఏకమై ఆపాలని కోరారు. నేడు సీపీఎస్‌లో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 50 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారని, వీరందరికీ కొత్త పెన్షన్ విధానం గుదిబండగా మారుతుందని చెప్పారు.
ఇప్పటికే కాంగ్రెస్ పాలితరాష్ట్రాలైన రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌తో పాటు పంజాబ్‌లోనూ పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఓరుగల్లు వేదికగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.