మహదేవపూర్, జూన్ 8 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌లో సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణుల బృందం పరిశోధనలు శనివారం కూడా కొనసాగాయి. బరాజ్‌లోని లోపాల అధ్యయనానికి ఈ నిపుణుల బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఐదు రోజులుగా బరాజ్‌లో పలు రకాలు పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరిస్తున్నారు.
మరో రెండు, మూడు రోజులపాటు పరిశోధనలు కొనసాగే అవకాశం ఉన్నదని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. కుంగిన 19, 20, 21వ పియర్ల వద్ద భూగర్భంలో ఇసుక నమూనాలను సేకరిస్తున్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు నిర్మాణ సంస్థ ఎల్టీ ఆధ్వర్యంలో బరాజ్‌లోని ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్ల వద్ద ఏర్పడిన ఖాళీ ప్రదేశాల్లో సిమెంట్, ఇసుక, కెమికల్ మిశ్రమాన్ని గ్రౌటింగ్ యంత్రాలతో పూడ్చుతున్నారు. బరాజ్ దిగువ ప్రాంతంలో నీటి ప్రవాహానికి పియర్ల చుట్టూ ఉన్న ఇసుక కొట్టుకుపోకుండా భారీ యంత్రాలు, క్రేన్ల సాయంతో షీట్ ఫైల్స్, సీసీ బ్లాక్‌లను తీసి అమర్చుతున్నారు.