చేపట్టిన తెలంగాణ ఐటీ శాఖ
గూగుల్ ఇండియా సహకారం
దేశంలోనే మొట్టమొదటిసారి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): పంట పొలాలను డిజిటలైజేషన్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పంట పొలాలను గూగుల్ మ్యాప్స్‌లో గుర్తించే కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా నాగుపల్లిలో చేపట్టిన ఈ కార్యక్రమం దేశంలోనే మొట్టమొదటిదని ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ఓఎస్డీ ఎల్ రమాదేవి తెలిపారు. ఒక ప్రాం తంలో ఉన్న పొలాల్లో ఎవరు, ఏ రకం పంట వేశారు? దాని విస్తీర్ణం ఎంత? ఆ భూమి ఎవరిది? అనే విషయాలను గుర్తించేందుకు ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని గూగుల్ ఇండియాతో కలిసి చేపట్టామని తెలిపారు. గ్రామాల్లో రైతులు ఏ పంట వేశారో గుర్తించటం వ్యయ ప్రయాసలతో కూడుకొన్న పని అని, దాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెక్‌పెట్టేలా ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. గత ఏప్రిల్ 28న గూగుల్‌తో తెలంగాణ ఐటీ శాఖ పలు అంశాలపై ఒప్పందం చేసుకొన్నదని, అందులో భాగంగానే వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రమాదేవి పేర్కొన్నారు.
30 సెంటీమీటర్ల దూరం నుంచే ఫొటోలు
శాటిలైట్ ఆధారంగా గూగుల్ మ్యాప్స్‌లో పంట పొలాలను అత్యంత దగ్గరగా ఫొటో తీయొచ్చు. భూమి కి కేవలం 30 సెంటీమీటర్ల దూరం నుంచే పొలాల్లో వేసిన పంటలను 2021 డిసెంబర్లో గూగుల్ ఫొటోలు తీసింది. ఆ ఫొటోలను గుర్తించేందుకు రైతులకు, వ్యవసాయశాఖ అధికారులకు ఈ మధ్యే అవగాహన కల్పించారు. కాగా, గూగుల్ మ్యాప్స్‌లో తీసిన పంటపొలాలను కచ్చితంగా ఎలా గుర్తించాలో రైతులకు వివరించి, ఆ ఫొటోలో ఉన్న పంటలు తమవేనని అంగీకరిస్తే దాని ప్రకారం నివేదిక రూపొందించనున్నారు. ఈ ప్రయోగాత్మక కార్యక్రమం విజయవంతమైనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఆ డాటాను గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తుంది. దీన్ని పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చని, వ్యవసాయ రంగం లో ఎమర్జింగ్ టెక్నాలజీలు మరింత సమర్థంగా ఉపయోగించుకొనే అవకాశం ఏర్పడుతుందని రమాదేవి
వెల్లడించారు.