Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 29 (హైదరాబాద్): త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాకు తెలంగాణ నుంచి భారీగా నగదు తరలింపు జరుగుతున్నట్టు కేంద్ర నిఘా వర్గాలకు ఉప్పందింది. ఈ మేరకు రంగంలోకి దిగిన ఐటీ, ఈడీ, డీఆర్ఐ బృందాలు కొన్నిరోజులుగా అనుమానిత వ్యక్తులు, వారికి చెందిన సంస్థల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర మీదుగా హర్యానాకు రూ.650 కోట్ల నగదు తరలింపునకు రంగం సిద్ధమైందని, ఇందులో ఇప్పటికే రూ.100 కోట్ల వరకు కొన్ని సూట్‌కేస్ కంపెనీలు, హవాలా వ్యాపారుల ద్వారా హర్యానాకు చేరవేశారని ఫైనాన్స్ ఇన్వెష్టిగేషన్ యూనిట్ పసిగట్టినట్టు సమాచారం. పొరుగు రాష్ట్రంలోని ఓ ఎలక్ట్రికల్ లిస్టెడ్ కంపెనీ ప్రతినిధుల ద్వారా ఈ హవాలా డబ్బును సర్దుబాటు చేసినట్టు గుర్తించారని తెలిసింది.
10 ప్రాంతాల్లో రహస్యంగా సోదాలు
వచ్చే నెల 5వ తేదీన హర్యానాలో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ జాతీయ పార్టీ కోసం తెలంగాణ ప్రభుత్వంలోని పలువురు పెద్దలు ఈ నిధులను సమీకరించారని, ఆ సొమ్మును హైదరాబాద్‌లోని పలుచోట్ల దాచి ఉంచారని, ఆ డబ్బును తరలించే బాధ్యతను ఒకరిద్దరు నేతలకు అప్పగించారని కేంద్ర నిఘావర్గాలకు సమాచారం అందింది. ఈ విషయం కేంద్ర నిఘా వర్గాల దృష్టికి రావడంతో ఆ సమాచారాన్ని ఈడీ, ఐటీ విభాగాలకు అందజేశారు. దీంతో ఆ రెండు విభాగాలకు చెందిన పలువురు అధికారులు రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే దాడులు జరిపినట్టు తెలుస్తున్నది. హైదరాబాద్‌లో శుక్రవారం 8 చోట్ల, శనివారం మరో రెండు చోట్ల ఈ తనిఖీలు చేపట్టారు. అతిరహస్యంగా ఈ దాడులు సాగినట్టు తెలుస్తున్నది.
పొంగులేటిపై దాడులు నిఘా వర్గాల సమాచారంతోనేనా?
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇండ్లు, కార్యాలయాల్లో గత రెండ్రోజులపాటు జరిపిన సోదాలు కేంద్ర నిఘావర్గాల సమాచారం మేరకేనని భావిస్తున్నారు. అయితే సోదాల్లో ఏం గుర్తించారనేది ఈడీ బృందాలు ఇంతవరకు అధికారికంగా వెల్లడించలేదు. దీంతో పలురకాల అంశాలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఈ సోదాల్లో 6 బ్యాగులతోపాటు 2 గోనె సంచుల్లో భారీగా డబ్బు పట్టుబడినట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. అయితే, ఇదంతా బూటకపు ప్రచారమని, కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో భాగంగా మంత్రి పొంగులేటి పేరును బయటకు తీసుకొచ్చారన్న చర్చ కూడా రాజకీయవర్గాల్లో సాగుతున్నది. కేంద్ర నిఘా వర్గాలు స్పష్టంగా వెల్లడిస్తే తప్ప, ఈ ఊహాగానాలకు తెరపడేలా కనిపించడం లేదు.