హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం వీడటం లేదు. పైగా కాకిలెక్కలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నది. సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సోమవారం విడుదల చేసిన గణాంకాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే డెంగ్యూ కేసులను, మరణాలను దాచిపెడుతున్నారని ఆరోపణలు ఉండగా.. తాజా గణాంకాలతో ఫీవర్ సర్వేపైనా అనుమానాలు మొదలయ్యాయి. ఇది ఫీవర్ సర్వే కాదని.. ‘పేపర్’ సర్వే అని వైద్యనిపుణులు, రాజకీయ పక్షాలు, నెటిజన్ల నుంచి విమర్శలు మొదలయ్యాయి. డీపీహెచ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత నెల 23వ తేదీన జ్వర సర్వే ప్రారంభించారు. ఈ నెల 25వ తేదీ నాటికి 1,42,78,723 ఇండ్లను సందర్శించి, 4,40,06,799 మందిని సర్వేచేశారు. ఇందులో 2,65,324 మంది జ్వరబాధితులను గుర్తించారు.
రాష్ట్ర జనాభా దాదాపు 4 కోట్లు. మరి వైద్యసిబ్బంది జనాభాను మించి ఎలా స్క్రీనింగ్ చేశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జ్వర సర్వే ప్రారంభమయినప్పటి నుంచి 34రోజుల్లోనే 4.40కోట్ల మందికి స్క్రీనింగ్ చేశామని చెప్తున్నారు. ఈ లెక్కన రోజుకు 13.75 లక్షల మందికి స్క్రీనింగ్ చేసినట్టని.. ఇది సాధ్యమేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక 1.42 ఇండ్లను సర్వే చేశామని చెప్పడంపైనా పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో దాదాపు కోటి కుటుంబాలు ఉన్నాయని.. రోజుకు 4.20 లక్షల ఇండ్లల్లో సర్వే నిర్వహించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయని చెప్తున్నారు. ఇదెలా సాధ్యమయ్యిందో వైద్యారోగ్య శాఖ వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. స్వయంగా డీపీహెచ్ ఒకే రోజు డెంగ్యూ కేసుల సంఖ్య, టెస్టుల సంఖ్యపై రెండు రకాల గణాంకాలు విడుదల చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఈ నెల 24న డీపీహెచ్ నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ నెల 21 నాటికి 66,589 డెంగ్యూ టెస్టులు చేశామని, 4,648 కేసులు నమోదయ్యాయని చెప్పగా, నమస్తే తెలంగాణకు ఇచ్చిన వివరణలో.. 23వ తేదీ నాటికి 63,532 మందికి టెస్టులు చేసి, 4,459 డెంగ్యూ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. రెండు రోజుల్లో కేసులు, టెస్టుల సంఖ్య పెరగాల్సిందిపోయి తగ్గినట్టు చెప్పారు. ఇదే తరహాలో జ్వర సర్వే లెక్కల్లోనూ స్పష్టత లేదని మండిపడుతున్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది ఎంత? ఎంత మందిని సర్వే కోసం నియమించారు? ఒక్కో బృందం రోజుకు సగటున ఎన్ని కుటుంబాలను, ఎంత మంది వ్యక్తులను సర్వే చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా.. పేపర్‌పై ఇష్టం వచ్చినట్టు నంబర్లు వేసి రిలీజ్ చేస్తే ఎలా? అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.