హైదరాబాద్: పండుగలకు పూర్వవైభవం రావాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో సంక్రాంతి సంబరాలు, గంగిరెద్దు విన్యాసాలు, హరిదాసుల కీర్తనలను మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్
వీక్షించారు.కైట్ ఫెస్టివల్ లో పాల్గొని పతంగులను ఎగురవేశారు. మంత్రి మాట్లాడుతూ కాలక్రమేణా సంస్కృతి సంప్రదాయాలు మరిచిపోతుండడం విచారకరమని అన్నారు.
మన పిండి వంటలు కాకుండా పిజ్జాలు, బర్గర్లు ఆర్డర్ చేసుకుని తినడం దురదృష్టకరమని అన్నారు.ఇతర దేశాల్లో మన పండుగలు ఘనంగా జరుపుకుంటున్నారని వెల్లడించారు. తెలుగు పండుగల పట్ల అవగాహన పెంచాలని అన్నారు.2014కు ముందు తెలంగాణలో నీళ్లు లేవని,సీఎం కేసీఆర్ ముందు చూపు వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలం అయిందని వెల్లడించారు.
దీంతో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న పండుగలు మరెక్కడా లేవని అన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు బోనాలు, బతుకమ్మ లాంటి పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఒక్కప్పుడు పంటలంటే కోనసీమ ప్రాంతం గుర్తొచ్చేదని నేడు కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ అన్నపూర్ణగా మారిందని అన్నారు.