హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ఒకవైపు పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేసి.. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పకడ్బందీగా ఫెన్సింగ్ వేస్తున్నది హైడ్రా (HYDRAA). కానీ హైడ్రా వేసిన ఫెన్సింగ్‌ను తీసేసి, అక్కడ రేకులు పెట్టి సవాల్ విసురుతున్న రాజకీయ నాయకుడి చర్యలను నిలువరించడంలో చోద్యం చూస్తున్నది. ఇదీ ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలో జరుగుతున్న వ్యవహారం. పేదల పట్ల దయలేకుండా వ్యవహరిస్తున్న హైడ్రా.. అధికార కాంగ్రెస్‌తో అంటకాగుతున్న ఎమ్మెల్యే పట్ల ఏం చేస్తుందని ప్రజల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో సర్వేనంబర్ 307లోని 317ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుని, ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రయత్నించింది. కానీ ఒక్కరోజు కూడా పూర్తి కాకముందే ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (Arekapudi Gandhi) తన అనుచరులతో వచ్చి అక్కడున్న ఫెన్సింగ్‌ను తొలగించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు అక్టోబర్ 1న ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తన కబ్జాలో ఉన్న భూమికి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆదివారం మళ్లీ ఫెన్సింగ్ వేయించారు. ఆ భూమిలో హైడ్రా వేసిన ఫెన్సింగ్‌ను తొలగించారు. మరో అడుగు ముందుకు వచ్చి మరీ రేకులతో పకడ్బందీగా కొత్త కంచెను ఏర్పాటు చేసుకున్నారు.
హైడ్రాను లెక్కచేయని ఎమ్మెల్యే
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారంటూ దాదాపు 11ఎకరాల్లో రేకులను గత నెలలో హైడ్రా తొలగించింది. కానీ అదేరోజు గాంధీ కుటుంబసభ్యులు అక్కడికి వచ్చి గొడవ చేశారు. ఫెన్సింగ్ తీసేయడానికి మీకెంత ధైర్యమంటూ రెవెన్యూ సిబ్బందిని, హైడ్రా బృందాన్ని నిలదీశారు. దీంతో వారు ఫెన్సింగ్ ఏర్పాటు పనులను మధ్యలోనే ఆపేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు హైడ్రా ఆఫీసులో చర్చ జరిగింది. ఆ తర్వాత అరికెపూడి గాంధీ మనుషులు హైడ్రా వేసిన ఫెన్సింగ్ తొలగించి, కొన్ని షీట్లు పెట్టి వదిలేశారు.
తిరిగి ఆదివారం పూర్తిస్థాయిలో మిథిలానగర్ వైపు బ్లూషీట్స్తో ఫెన్సింగ్ వేసి హైడ్రాకు సవాల్ విసిరారు. అరికెపూడి గాంధీ చేపట్టిన ఫెన్సింగ్ పనుల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై హైడ్రా నుంచి ఎలాంటి స్పందన లేదు. పేదలకో న్యాయం… పెద్దలకో న్యాయం అనే రీతిలో హైడ్రా వ్యవహరిస్తున్నదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజులరామారం, కొండాపూర్‌లో పేదల ఇండ్లు కూల్చి, ఫెన్సింగ్ వేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు అరికెపూడి గాంధీ విసురుతున్న సవాల్‌పై ఏం చర్యలు తీసుకుంటారని నిలదీస్తున్నారు. గాంధీ తీరు నగరవాసుల్లో చర్చనీయాంశమైంది.