నర్సంపేట, ఆగస్టు 21 : సబ్జైల్లో ఉన్న రిమాండ్ మహిళా ఖైదీ అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట పట్టణం గాంధీనగర్‌కు చెందిన పెండ్యాల సుచరిత (37) హన్మకొండ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసు విషయంలో ఈ నెల 13న నర్సంపేటలోని సబ్‌జైల్‌కు వచ్చింది. అప్పట్లో జైలు అధికారులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి, రిమాండ్‌కు అనుమతించారు.
సుచరితకు అనారోగ్య సమస్యరీత్యా ఈ నెల 20న నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు జైలు అధికారులు తీసుకెళ్లారు. వైద్యపరీక్షలు నిర్వహించి అదే రోజు జైలుకు తీసుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున సుచరిత బాత్రూంకు వెళ్లి అక్కడే స్పృహతప్పి పడిపోయింది. గమనించిన జైలు సిబ్బంది వెంటనే ఆమెను ప్రభుత్వ జనరల్ వైద్యశాలకు తరలించారు.
వైద్యులు పరీక్షించి, అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. కాగా.. సుచరిత చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్టు నర్సంపేట సబ్‌జైలర్ శృతి పేర్కొనడం.. దవాఖానకు రాకముందే ఆమె మృతి చెందినట్టు ప్రభుత్వ వైద్యురాలు అనూష నిర్ధారించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. జైలు అధికారుల తప్పిదంతో ఆమె మృతి చెందిందా…అనారోగ్యంతో మృతి చెందిందా…అనేది తేలాల్సి ఉంది. నర్సంపేట ఎస్సై రవికుమార్ సుచరిత మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.