బడంగ్‌పేట, ఆగసు ్ట2: ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శంకర్ కుమార్‌నాయక్ వివరాల ప్రకారం.. మనీషా(24) మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రశాంత్ హిల్స్ రోడ్ నంబర్-1 ప్లాట్ నంబర్-34లో నివాసం ఉంటున్నది. 2017 నవంబర్‌లో సుధాకర్‌తో వివాహం కాగా, నాలుగు, రెండేండ్ల వయసున్న ఇద్దరు బాబులు ఉన్నారు. మనీషా ఐదేండ్లుగా మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నది. జూలై 25న ఇంట్లో గడ్డి మందు తాగగా, భర్త సుధాకర్ ఆమెను డీఆర్డీవో అపోలో దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నాంపల్లిలోని కేర్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మృతి చెందినట్టు తండ్రి కట్రావత్ క్రిష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.