Real Estate | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం తిరోగమన దిశలో సాగుతున్నది. గత మూడు నెలలుగా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో భూముల క్రయవిక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయని, ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ-2)లో మొత్తంగా 325 ఎకరాలకు సంబంధించిన 25 లావాదేవీలు మాత్రమే జరిగాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్’ తన తాజా నివేదికలో వెల్లడించింది.
ధరల పెరుగుదల, సార్వత్రిక ఎన్నికలే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నది. నిరుడు ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 721 ఎకరాలకు సంబంధించిన 29 లావాదేవీలు జరిగినట్టు తెలిపింది. ప్రస్తుతం లావాదేవీల సంఖ్యలో బెంగళూరు అగ్రగామిగా నిలిచిందని, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య ఆ నగరంలో 114 ఎకరాలకు సంబంధించిన 9 వేర్వేరు లావాదేవీలు జరిగాయని ‘అనరాక్’ గ్రూప్ రీజినల్ డైరెక్టర్, రిసెర్చ్ అండ్ అడ్వైజరీ హెడ్ ప్రశాంత్ థాకూర్ వెల్లడించారు.
ఇదే సమయంలో గుర్గావ్లో 7 లావాదేవీల ద్వారా 77.5 ఎకరాలు, ముంబైలో 2 లావాదేవీల ద్వారా 4.52 ఎకరాలు, హైదరాబాద్లో 1 లావాదేవీ ద్వారా 48 ఎకరాలు, పుణెలో 2 లావాదేవీల ద్వారా 27.5 ఎకరాలు, చెన్నైలో 1 లావాదేవీ ద్వారా 27 ఎకరాలు, థానేలో 2 లావాదేవీల ద్వారా 24.95 ఎకరాలు, అహ్మదాబాద్లో 1 లావాదేవీ ద్వారా కేవలం 1.37 ఎకరాల విక్రయాలు జరిగినట్టు వివరించారు.
