హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లల్లో 25శాతం సీట్లకు సంబంధించిన ఫీజులను విద్యార్థుల ఖాతాల్లోనే జమచేయాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) ప్రభుత్వాన్ని కోరింది. ఏ స్కూల్లో చదవాలన్న ఆప్షన్‌ను విద్యార్థులకే వదిలేయాలని సూచించింది.
ట్రస్మా ప్రతినిధులు బుధవారం మంత్రి శ్రీధర్‌బాబును సచివాలయంలో కలిసి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ఫీజుల నియంత్రణలో భాగంగా రూ. 50-70వేల ఫీజులు గల పాఠశాలలను ఫీజు రెగ్యులేటరీ కమిషన్ నుంచి మినహాయించాలని కోరారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఐవీ రమణారావు, కోశాధికారి ఎస్ జైసింహగౌడ్ తదితరులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.