హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల ఫీజులు భారీగా పెరిగాయి. ఈ మేరకు తెలంగాణ మోటరు వాహనాల నిబంధనలు-1989లోని రూల్ 81ను సవరిస్తూ ప్రభుత్వం శనివారం జీవో 77ను విడుదల చేసింది. దీంతో కొన్ని ఫ్యాన్సీ నంబర్ల ఫీజులు దాదాపు మూడు రెట్ల వరకు పెరిగాయి. గతంలో రూ.50 వేలుగా ఉన్న 9999 ఫ్యాన్సీ నంబర్ ఫీజు ఇప్పుడు రూ.1.5 లక్షలకు పెరిగింది. ఈ ఫీజులు ఆదివారం నుంచే అమల్లోకి వస్తాయి. కొత్త జీవో ప్రకారం ఇకపై ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. రవాణా శాఖ పోర్టల్ www.transport.telangana. gov.inలో ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1 గంట వరకే దరఖాస్తులు స్వీకరిస్తారు.
ప్రత్యక్షంగా ఇచ్చే దరఖాస్తులను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఒకే నంబర్ కోసం రెండు లేదా అంతకంటే ఎకువ దరఖాస్తులు వస్తే అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య ఆన్లైన్ బిడ్డింగ్ (వేలం) నిర్వహించి నంబర్‌ను కేటాయిస్తారు. నంబర్ రిజర్వ్ అయిన తేదీ నుంచి 15 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ కోసం వాహనాన్ని తెచ్చి చూపించాల్సి ఉంటుంది. ఈ గడువులోగా వాహనాన్ని రిజిస్టర్ చేయకపోతే కేటాయించిన నంబర్ రిజర్వేషన్ రద్దవుతుంది. ఆ నంబర్‌ను మళ్లీ నోటిఫై చేస్తారు. ఫ్యాన్సీ నంబర్ల ద్వారా హైదరాబాద్‌లోని 5 ఆర్టీఏలకు 2023-24లో రికార్డు స్థాయిలో రూ.124.2 కోట్ల ఆదాయం వచ్చింది. తాజా సవరణలతో ఆదాయం మరిం త పెరిగే అవకాశం ఉన్నది. కొత్త నిబంధనలపై ప్రజలకు అభ్యంతరాలుంటే రవాణా శాఖ కమిషనర్ ద్వారా 30 రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియజేయవచ్చని జీవోలో పేరొన్నారు.
