హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడం లో భాగంగా సర్కారు కొత్త ఎత్తుగడతో రెడీ అయ్యింది. రీయింబర్స్మెంట్ పథకంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ది. నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేయాలన్న ఆలోచనలో సర్కారు ఉంది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల పేరుతో జాయింట్ అకౌంట్ తీస్తారు. రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఆయా ఖాతాలో జమచేస్తారు. విద్యార్థులే సొంతంగా కాలేజీలకు ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. రీయింబర్స్మెం ట్ బకాయిలు విడుదల చేయాలంటూ కాలేజీ యాజమాన్యాలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సర్కారు ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో మార్పులు చేస్తే విద్యార్థులు, తల్లిదండ్రులపై మోయలేని భారం పడనున్నది. ప్రస్తుతం కన్వీనర్ కోటాలో సీటు పొందినవారు ట్యూషన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరంలేదు. కేవలం కౌన్సెలింగ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.