విద్యానగర్, జూలై 14: ‘ఫీజురీయింబర్స్‌మెంట్‌పై వన్‌టైం సెటిల్మెంట్ ఏంది? ఇదేమైనా బ్యాంకు అనుకుంటున్నరా? లోన్లు తీసుకుని వడ్డీలు కట్టలేక సెటిల్మెంట్ చేసుకోవడానికి’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. ఏండ్ల తరబడి ఫీజులు కట్టకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని సూచించారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ‘అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌లో చేరుతున్నారని మాట్లాడుతున్న అధికార పార్టీ నేతలారా? నిజంగా మీరు అభివృద్ధి చేసున్నట్టు భావిస్తే మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరే దమ్ముందా?’ అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే అధికార పార్టీలో చేరుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నామని వల్లించడం సిగ్గుచేటన్నారు. దొంగ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కొందరేమో అధికారం ఎకడుంటే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారని విమర్శించారు. బీజేపీలో చేరేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నా.. రాజీనామా చేసి రావాలని చెబుతున్నామని, ఇదే తమ విధానమని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ మోసాలు, దొంగ హామీలను ప్రజలుగుర్తిస్తున్నారని.. అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనే ఇందుకు నిదర్శనమని అన్నారు.