గంగాధర, అక్టోబర్ 11: బెస్ట్ అవైలెబుల్ స్కూళ్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశాడు. శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో బెస్ట్ అవైలెబుల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జెంకి అనిల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లుగా బిల్లులు చెల్లించడకపోవడంతో బెస్ట్ అవైలెబుల్ స్కూల్ యాజమాన్యాలు పిల్లలను పాఠశాలల్లోకి అనుమతించడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. లేదంటే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
సర్కారు ‘బెస్ట్’ నిధులు ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు ; దళిత, గిరిజన, విద్యార్థి, ప్రజాసంఘాలు
హైదరాబాద్, అక్టోబర్11 (నమస్తే తెలంగాణ): బెస్ట్ అవలైబుల్ స్కీమ్ స్కూళ్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, లేదంటే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని దళిత, గిరిజన, విద్యార్థి, ప్రజాసంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మునుపెన్నడూ లేనంతగా కాంగ్రెస్ పాలనలోనే విద్యార్థులకు ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, తెలంగాణ గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ నాయకులు సైలాబ్బాబు, ఆర్ శ్రీరాంనాయక్, నాగరాజు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.