హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేశ్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మండిపడ్డారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై బండ్ల వ్యాఖ్యలను సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. హరీశ్‌రావును విమర్శించే స్థాయికి బండ్ల గణేశ్‌కు లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తికి ఇవన్నీ ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప చరిత్ర బీఆర్ఎస్కు ఉన్నదని, అటువంటి పార్టీపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పెద్ద నాయకులను విమర్శిస్తే పెద్దవాడిని అవుతాననే భ్రమతో బండ్ల మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.