హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం తీవ్రంగా ఖండించారు.
రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న ఆమె ప్రభుత్వంపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజ్‌భవన్‌లో రాజకీయాలు చేయడం మంచిది కాదని, గవర్నర్ తన స్థాయికి తగినట్లు మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తుంటే గవర్నర్ మాత్రం విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా, రాజ్యాంగబద్ద హోదాలో ఉన్నట్లుగా గవర్నర్ ప్రవర్తించి తన గౌరవాన్ని కాపాడుకోవాలన్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా మార్చుకొని బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారని, రాజ్యాంగ పరంగా గవర్నర్‌కు కొన్ని పరిమితులు ఉంటాయని, వాటిని దాటడం సరికాదని అనిల్ కుర్మాచలం అన్నారు.