గజ్వేల్, ఏప్రిల్ 25: సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్సీఆర్ఐ) విద్యార్థులు అడవుల ప్రాముఖ్యతపై పరిశోధనలు చేసి వాటి ఆవశ్యకతను సమాజానికి తెలియజేయడానికి చేసిన ప్రయత్నం సఫలీకృతం అవుతున్నది. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణులకు జీననాధారంలాంటి అడవుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులు పరిశోధనలు చేపట్టారు. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు డిగ్రీలు, పీజీలు పూర్తి చేశారు. కళాశాల నుంచి తొలిసారిగా ఐదుగురు విద్యార్థులు పీహెచ్డీ పట్టాలు సాధించారు.
కేసీఆర్ కలల విద్యాసంస్థ…
సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధనాసంస్థ(ఎఫ్సీఆర్ఐ) 2016లో అడవుల విస్తరణ, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అప్పటి సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. మొదట్లో ఈ కళాశాలను దూలపల్లి ఫారెస్టు అకాడమీలో కొనసాగించారు. సిద్దిపేట జిల్లా ములుగు రాజీవ్ రహదారి పక్కన నిర్మించిన అధునాతన భవనంలోకి 2019లో తరలించారు. ఇప్పటి వరకు 587మంది ఫారెస్ట్రీ విద్యను అభ్యసించగా, అందులో 302 మంది డిగ్రీ, 46మంది ఎమ్మెసీస పూర్తి చేశారు. 2023-24 నుంచి పీహెచ్డీ పరిశోధనలు ప్రారంభించగా.. ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థులు పట్టాలను సాధించగా, ఇద్దరు పరిశోధనలు చేస్తున్నారు. పీహెచ్డీ పట్టాలు సాధించిన ఐదుగురు విద్యార్థులను కళాశాల డీన్ డాక్టర్ ప్రవీణ, జాయింట్ డైరెక్టర్ శ్రీధర్‌రావు, అధ్యాపకులు అభినందించారు.
తొలిసారి పీహెచ్‌డీలు సాధించిన విద్యార్థులు..
అటవీ కళాశాల నుండి పీహెచ్డీ పట్టాలు సాధించిన ఐదుగురు విద్యార్థులు వివిధ రకాల పరిశోధనలను గైడ్ల పర్యవేక్షణలో పూర్తిచేశారు. అందులో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భగీరథీ గ్రామానికి చెందిన తాళ్లపల్లి సాయిదీప్ అటవీ కళాశాలలో ‘బయోచార్’ అంశంపై గైడ్ల పర్యవేక్షణలో డ్రమ్ పద్ధతిలో అతి తక్కువ ఖర్చుతో పరిశోధన చేశాడు. దీని వాడకంతో భూసారం పెరిగి పంటలకు మేలు చేకూరడంతోపాటు నత్రజని నష్టాలు తగ్గుతాయి. తాను తయారు చేసిన బయోచార్ను త్వరలోనే రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సాయిదీప్ తెలిపారు. మరో విద్యార్థి రావుల రోహిత్ నిర్మల్, మంచిర్యాల జిల్లాలో విస్తరించిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో వనరుల సంరక్షణ, సద్వినియోగానికి సిల్వికల్చర్, ఆగ్రో ఫారెస్ట్రీపై ప్రొఫెసర్ డాక్టర్ చిరంజీవరెడ్డి పర్యవేక్షణలో అధ్యయనం పూర్తి చేశాడు.
నారాయణపేట్ జిల్లా మక్తల్ మండల పరిధిలోని జకైలర్ గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పర్యావరణ సేవలు.. ఆర్థిక మూల్యాంకనం అనే అంశం పరిశోధన చేపట్టాడు. గిరిజనులతో కలిసి పర్యావరణ సంరక్షణ, ప్రయోజనాలను తెలుసుకున్నారు. అడవుల అభివృద్ధికి ఏంచేయాలో తన నివేదిక ద్వారా సూచించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం నారపల్లి గ్రామానికి చెందిన స్నేహాంజలి అటవీశాస్త్రం, వృక్షాల అభివృద్ధి విభాగంలో అంతరించిపోతున్న ఔషధ మొక్కల జాతులపై డాక్టర్ షాలిని పర్యవేక్షణలో పరిశోధన పూర్తిచేశారు. అటవీ ప్రాంతాల్లో అత్యంత అరుదుగా లభించే ఔషధ జాతుల మొక్కలను కనుగొని వాటి పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. మరో విద్యార్థి బోచు జీవన్ ‘ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యంలో ఫైటోసోసియాలజీ కార్బన్ నిల్వలు మట్టిలో పోషకాల’పై ప్రొఫెసర్ మమత మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తిచేశారు. మరో ఇద్దరు విద్యార్థులు పరిధోశన చేస్తున్నారు.
ఆఫీసర్ ట్రెయినీ హోదాకు నలుగురు ఎంపిక…
కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఆఫీసర్ట్రెయినీ హోదా ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో గొంగటి శ్రీవర్ధన్ (నంద్యాల), ముత్యాల చందన (దంతపల్లి-ఆదిలాబాద్), ముత్యాల నరేశ్(ఖమ్మం), బొచ్చు జీవన్ (పైడిపల్లి-వరంగల్) ఉన్నారు.
పరిశోధనల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం…
అటవీ కళాశాల విద్యార్థులు పరిశోధనలు విజయవంతంగా పూర్తిచేసేలా ప్రోత్సహిస్తున్నాం. కళాశాలలో విద్యార్థులు వివిధ రకాల కోర్సులను అభ్యసించారు. ఫారెస్ట్రీ పీజీ పూర్తయిన విద్యార్థులు అడవులపై పరిశోధనలు చేసేలా ప్రోత్సహిస్తున్నాం. సమాజానికి అడవుల ప్రయోజనాలను తెలియజేయాలన్నదే ప్రధాన ఉద్దేశం.
-డాక్టర్ ప్రవీణ, డీన్,అటవీ కళాశాల ములుగు