హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : టీచర్ల శిక్షణ పైన పటారం.. లోన లొటారాన్ని తలపిస్తున్నది. శిక్షణ తొలిరోజే అనేక సమస్యలు ఎదురయ్యాయి. టీజీ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ సర్వర్ మొరాయించింది. టీచర్లంతా ఫోన్లతో కుస్తీపట్టాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల టీచర్ల శిక్షణ మంగళవారం ప్రారంభమయ్యింది. అయితే సాంకేతిక సమస్యలు వెంటాడాయి. టీచర్లను ఉదయం 9 గంటల నుంచి 9:30గంటల లోపే రిపోర్ట్చేయాలన్నారు. కానీ పలు శిక్షణ కేంద్రాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు చెక్ఇన్ కోసం ఎదురుచూపులు తప్పలేదు.
జియో ట్యాగింగ్ ఊసేలేకుండా పోయింది. ఫీడ్‌బ్యాక్‌కు సర్వర్ బిజీ అని వచ్చింది. రిసోర్స్ పర్సన్స్ జాబితా గందరగోళంగా తయారయ్యింది. శిక్షణ కేంద్రాల్లో సదుపాయాలు కేటాయించలేదు. చిన్నారులు కూర్చుండే బెంచీల మీద కూర్చోలేక టీచర్లు అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల ప్రొజెక్టర్లు, స్పీకర్లు సరిగ్గా పనిచేయలేదని టీచర్లు వాపోయారు. డ్యూటీలు వేసినా కొందరు స్టేట్ రిసోర్స్పర్సన్లు జిల్లాల్లో తనిఖీలకు వెళ్లలేదట. ఎస్సీఈఆర్టీ ఆఫీసుకే పరిమితమయ్యారట. దీంతో తనిఖీలకు వెళ్లని వాళ్లకు డ్యూటీలెందుకు వేశారని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విధులను విస్మరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.