వేములవాడ, సెప్టెంబర్ 29: ఆస్తి పంచివ్వాలని కొడుకు, కూతుర్లు కత్తి, ఇటుకలతో దాడి చేసి తండ్రిని హతమార్చారు. ఈ దాడిలో తీవ్ర గాయాలై పినతల్లి దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ ఘటన ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకున్నది. పట్టణంలోని చెక్కపెల్లి రహదారిలో మామిండ్ల మల్లయ్య(53)-బాలవ్వ దంపతులకు ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. బాలవ్వ 15 ఏండ్ల క్రితం మృతిచెందడంతో మల్లయ్య పద్మను రెండో పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. కొద్ది రోజులుగా ఆస్తి పంపకాల విషయంలో మొదటి భార్య కూతుర్లు, కొడుకుతో మల్లయ్య కు వివాదం నడుస్తున్నది. ఆదివారం పంచాయతీ కోసం కుల సంఘం పెద్దల ను పిలిపించారు. రెండో భార్య పిల్లలు చిన్నవాళ్లని, వారు పెద్దయ్యాక ఆస్తి పంచుతానని మల్లయ్య చెప్పి పంచాయితీ మధ్యలోనే వెళ్లిపోయాడు. దీంతో బాలవ్వ కొడుకు, కూతుర్లు, అల్లుండ్లు మల్లయ్య నివాసానికి చేరుకున్నారు. అక్కడ చిన్నపాటి గొడవ జరగగా క్షణికావేశానికి లోనై కత్తి, ఇటుకలతో దాడి చేయగా మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుగా వచ్చిన పద్మకు తీవ్ర గాయాలు కాగా.. దవాఖానకు తరలించారు. ఏఎస్పీ శేషాద్రినీరెడ్డి, సీఐ వీరప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
రేగొండ, సెప్టెంబర్ 29 : పిచ్చికుక్కల దాడిలో 30 మందికి పైగా తీవ్ర గాయాలైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దుంపిల్లపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. బాగిర్తిపేట, దుంపిల్లపల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం సుమారు 50 కుకలు స్వైర విహారం చేశాయి. ఇండ్ల ముందు కూర్చున్న వృద్ధులు, పిల్లలపై దాడి చేసి గాయపరిచాయి. గ్రామస్థులు వారిని 108 వాహనంలో పరకాల దవాఖానకు తరలించారు.