Wargal | వర్గల్, మార్చి 5: రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందిన విషయం తెలిసిన కూతురు దుఃఖాన్ని దిగమింగుతూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరైన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రానికి చెందిన పసుల లింగం(50) తూప్రాన్‌కు సొంతపనిపై వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో నాచారం వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే అతడిని గజ్వేల్‌కు, ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యం లో మృతిచెందాడు. పసుల లింగానికి భార్య యాదమ్మతో పాటు కుమారుడు సాయికుమార్, కూతురు తేజశ్రీ ఉన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజశ్రీకి బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యా యి. ఓ పక్కన తండ్రి మృతిచెందాడనే విషాద ఘటన, మరోవైపు వార్షిక పరీక్షలు ప్రారంభమవుతుండడంతో గుండెల్లో బాధను దిగమింగుతూ తేజశ్రీ పరీక్షకు హాజరైంది.