మరికల్, జూలై 27: నారాయణపేట జిల్లా (Narayanpet) మరికల్ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కన్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మడలంలోని పూసలపాడు (Pusalapahad) గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన 9 ఏండ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐదో తరగతి చదువుతున్న చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు అధిక రక్తస్రావం కావడంతో విషయం తల్లికి చెప్పింది.
దీంతో శనివారం ఉదయం చిన్నారిని మహబూబ్నగర్ దవాఖానకు తరలించారు. అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. దవాఖానకు వచ్చిన పోలీసులు అఘాయిత్యానికి సంబంధించిన వివరాలు బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తండ్రి పరారీలో ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు తెలిసింది.