వేములపల్లి, సెప్టెంబర్ 5: సాగర్ ఎడమకాల్వలో వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వచ్చి తండ్రీకొడుకు గల్లంతైన ఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే .. మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్కు చెందిన పున్న సాంబయ్య (46), పున్న శివమణి (20) తమ గ్రామంలోని వినాయకుడిని తమ వీధి వారితో కలిసి మండల కేంద్రం సమీపంలోని ఎడమకాల్వలో నిమజ్జనం చేయడానికి వచ్చారు. నిమజ్జనం అనంతరం తండ్రి, కొడుకు తమపై ఉన్న రంగులను శుభ్రం చేసుకోవడానికి కాల్వలో దిగిన సమయంలో ప్రమాదవశాత్తు తండ్రి సాంబయ్య జారిపడ్డాడు. తండ్రిని కాపాడుదామని కొడుకు యత్నించి కాల్వలోకి జారిపోయాడు. పక్కనే ఉన్న నవీన్ అనే వ్యక్తి వారిని కాపాడేందుకు కాల్వలో దూకగా అప్పటికే సాంబయ్య, శివమణి గల్లంతయ్యారు. దీంతో నవీన్ ఈదుకుంటూ కాల్వ ఒడ్డుకు చేరుకున్నాడు. కాల్వలో బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండడం వల్ల వెంటనే ఇద్దరు మునిగిపోయినట్టు స్థానికులు తెలిపారు. సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎస్పీ రాజశేఖర్‌రాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గల్లంతైన వారి కోసం సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
కరువైన భద్రతా ఏర్పాట్లు…
నిమజ్జన ప్రాంతంలో సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రంగా మాత్రమే సిబ్బందిని నియమించారని తెలిపారు. సరైన వేతనం, భోజన సదుపాయం కల్పించకపోవడంతో విధులకు రావడం లేదని గజ ఈతగాళ్లు తెలిపారు. గజ ఈతగాళ్లు లేకనే వారిని కాపాడలేకపోయినట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
అనాథగా మిగిలిన కూతురు…
ప్రమాదానికి గురైన సాంబయ్యకు కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు శివ ఐటీఐ చదువుతుండగా కూతురు 7వ తరగతి చదువుతున్నది. చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. తండ్రి వంట మాస్టర్‌గా పనిచేస్తూ పిల్లలను పోషిస్తున్నాడు. తండ్రి, అన్న గల్లంతు కావడంతో చిన్నారి అనాథగా మిగిలిందని గ్రామస్థులు విచారం వ్యక్తంచేశారు.