హత్నూర, డిసెంబర్ 20: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి తండ్రీకొడుకు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్లో మంగళవారం సాయంత్రం జరిగింది. గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెక్కల ప్రభు (46), చెక్కల నాగరాజు (23) తండ్రీకొడుకులు. వీరు మంగళవారం సాయంత్రం తుర్కలఖానాపూర్ శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడటంతో చేపల కోసం వేసిన వలలో చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందారు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం తెల్లవారుజామున మృతదేహాలు చెరువులో తేలాయి. హత్నూర ఎస్సై సుభాష్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ఏరియా దవాఖానకు తరలించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే వీ సునీతాలక్ష్మారెడ్డి ఏరియా దవాఖానకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.