జిన్నారం, జనవరి 8 : ఓ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం- ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని మైలాన్ లాబొరేటరీస్ లిమిటెడ్ యూనిట్-1లో చోటుచేసుకున్నది. ఆదివారం ఉదయం 11:40 ప్రాంతంలో ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ)లో ఏర్పడిన మంటలు కెమికల్ డ్రమ్ములకు అంటుకొని ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అక్కడే పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంట్రాక్టు కార్మికుడు పరితోశ్ మెహతా (40), బీహార్ వాసి రంజిత్‌కుమార్(27), ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వర్ (38)లకు మంటలు అంటుకున్నాయి.
వీరు దాదాపు 80 శాతం కాలిపోవడంతో అంబులెన్స్‌లో దవాఖానకు తరలించేలోపే ప్రాణాలు వదిలారు. అగ్ని ప్రమాదంతో పరిశ్రమలోని కార్మికులతోపాటు సమీపంలో ఇతర పరిశ్రమల కార్మికులు సైతం భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బొల్లారం సీఐ సురేందర్‌రెడ్డి సిబ్బందితో వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు పరిశ్రమను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.