Ajay Devgn | ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 సందర్భంగా బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ భారీ పెట్టుబడులతో హైదరాబాద్ వైపు దృష్టి సారించారన్న చర్చ హాట్ టాపిక్‌గా మారింది. సల్మాన్ ఖాన్ అత్యాధునిక ఫిలిం స్టూడియో ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వినిపించగా, అజయ్ దేవగన్ కూడా స్టూడియో నిర్మాణం కాకుండా భిన్నమైన వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్ దేశవ్యాప్తంగా ‘దేవగన్ సినీ-ఎక్స్’ పేరుతో మల్టీప్లెక్స్ స్క్రీన్లను ప్రారంభించాలనే ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి దశలోనే పలు నగరాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేసి, మొత్తం మీద సుమారు 250 స్క్రీన్లను వివిధ దశల్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే గుర్గావ్లో ‘దేవగన్ సినీ-ఎక్స్’ పేరుతో ఒక థియేటర్ విజయవంతంగా నడుస్తోంది.
ఇంతకుముందు అజయ్ దేవగన్–కాజోల్ దంపతులు తమ పిల్లల పేర్లపై ‘ఎన్-వై సినిమాస్’ పేరిట థియేటర్ వ్యాపారం నిర్వహించినప్పటికీ, ఇప్పుడు బ్రాండ్ విలువ పెంచే ఉద్దేశంతో ‘దేవగన్’ అనే పేరునే ముందుకు తెచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో దేవగన్ సినీ-ఎక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నగరంలోని కర్మన్‌ఘాట్ కొలీజియం మాల్లో ఏడు స్క్రీన్లతో కూడిన లగ్జరీ మల్టీప్లెక్స్‌ను వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు. దీనిని దేశవ్యాప్తంగా విస్తరించాలన్నది అజయ్ దేవగన్ దీర్ఘకాల లక్ష్యంగా తెలుస్తోంది.
సినిమా కెరీర్ విషయానికి వస్తే, అజయ్ దేవగన్ ఇటీవల ‘సన్ ఆఫ్ సర్దార్ 2’, ‘దే దే ప్యార్ దే 2’ చిత్రాల్లో కనిపించారు. ‘దే దే ప్యార్ దే’ బాక్సాఫీస్ వద్ద సంతృప్తికర ఫలితాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ‘దృశ్యం 3’, ‘ధమాల్ 4’, ‘రేంజర్’ వంటి చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా, ఇవన్నీ 2026లో విడుదలై ఆయన కెరీర్‌కు మరింత బూస్ట్ ఇవ్వనున్నాయనే అంచనాలు ఉన్నాయి.మరోవైపు, హైదరాబాద్‌లో ఇప్పటికే తెలుగు స్టార్లు మల్టీప్లెక్స్ రంగంలో దూసుకుపోతున్నారు. మహేష్ బాబు – ఏఎంబీ మాల్, అల్లు అర్జున్ – ఏఏఏ సినిమాస్, రవితేజ – ఏఆర్టీ సినిమాస్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. త్వరలో మహేష్ బాబు–వెంకటేష్ కాంబినేషన్లో ‘ఏఎంబీ క్లాసిక్’ కూడా ప్రారంభం కానుంది. అల్లు కుటుంబం హైదరాబాద్ అవుటర్‌లో భారీ ఫిలిం స్టూడియోతో పాటు మరో మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో, ఇప్పుడు అజయ్ దేవగన్ కూడా మల్టీప్లెక్స్ రంగంలో అడుగుపెట్టడంతో, తెలుగు స్టార్లతో పోటీ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. బాలీవుడ్ స్టార్ బ్రాండ్ హైదరాబాద్ మార్కెట్లో ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.