హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): మెరుగైన పాస్పోర్టు సేవలు అందించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని సికింద్రాబాద్ రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. తత్కాల్, సాధారణ అపాయింట్మెంట్లను పెంచి, కాలపరిమితిని తగ్గించి వేగంగా సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రీజియన్ పరిధిలో ఉన్న 5 పీఎస్కే, 14 పీవోపీఎస్కేల ద్వారా మెరుగైన పాస్పోర్టు సేవలు అందుతున్నాయని చెప్పారు. ప్రతి పాస్పోర్టు సేవా కేంద్రంలోనూ అపాయింట్మెంట్ల సంఖ్యను కూడా పెంచినట్టు తెలిపారు. హైదరాబాద్లోని మూడు పీఎస్కే సెంటర్లలో అమీర్పేట్(50), బేగంపేట(100), టౌలిచౌకీ(50)తో పాటు కరీంనగర్, నిజామాబాద్ కేంద్రాలకు 20 చొప్పున అపాయింట్మెంట్లను పెంచగా, సోమవారం నుంచి ఇవి అమలులోకి వచ్చినట్టు పేర్కొన్నారు.