హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉస్మానియా యూనివర్సిటీ అనుమతులు మంజూరుచేసింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ‘బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ’, ‘బ్యాచిలర్ ఇన్ అపారెల్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ’ కోర్సుల నిర్వహణకు అనుమతిచ్చింది. మూడేండ్ల కాలవ్యవధి ఉన్న ఈ కోర్సుల్లో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. త్వరలోనే మరిన్ని కాలేజీలు ముందుకొస్తాయని అధికారులు భావిస్తున్నారు.
కొత్తగా ఓయూ క్యాంపస్లో హోటల్ మేనేజ్మెంట్, బీపీఈడీ, బీ ఫార్మసీ కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. ఈ కోర్సులు కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో కొనసాగుతున్నాయి. ఓయూ క్యాంపస్లో లేవు. ఈ కోర్సులను పీజీలో నిర్వహిస్తుండగా, యూజీలో కూడా ప్రవేశపెట్టాలని ఓయూ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. 60 సీట్లతో బీ ఫార్మసీ కోర్సును నిర్వహించాలని నిర్ణయించారు. హోటల్ మేనేజ్మెంట్, బీపీఈడీ కోర్సులను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు వర్సిటీ అధికారులు వెల్లడించారు.