50 లక్షల ఎకరాల్లో పత్తి వరి 32 లక్షల ఎకరాలు
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వానకాలం పంటల సాగు కోటి ఎకరాలు దాటింది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.04 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ పేర్కొన్నది. ఇందులో అత్యధికంగా పత్తి 50.21 లక్షల ఎకరాల్లో సాగు కాగా.. 32.60 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. కంది 8.77 లక్షలు, సోయాబీన్ 3.47 లక్షల ఎకరాల్లో సాగయింది. గతంలో తగ్గిన మొక్కజొన్న సాగు ఈసారి భారీగా పెరిగింది. ఇప్పటికే సుమారు 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. గతేడాది ఈ సమయానికి 1.90 లక్షల ఎకరాల్లో మాత్రమే మొక్కజొన్న సాగైంది. వాతావరణ పరిస్థితులు ఈసారి సాగుపై ప్రభావాన్ని చూపాయి. వర్షాలు అనుకున్న సమయంలో ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో ఆ ప్రభావం పంటల సాగుపై పడింది. గతేడాది ఈ సమయం వరకు 1.19 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.