హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నప్పుడు వాటిని కప్పిపుచ్చుకొనేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు కొందరు ‘డైవర్షన్ డ్రామా’ ఆడుతుంటారు. ఓటమి కండ్లముందే కనిపిస్తున్నా.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ నెల 12వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసింది ఇదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఏడాది కిందటే ఉత్పత్తి ప్రారంభించిందని అందరికీ తెలిసిందే. ఈ ఫ్యాక్టరీని మోదీ త్వరలో ప్రారంభించనున్నారని 2021 జనవరి 24నే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓ ప్రకటన చేశారు. మొన్నటికి మొన్న మే నెలాఖరున ప్రారంభిస్తారని మరోసారి కసరత్తుచేశారట. చివరకు దానిని జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని ‘వర్చువల్’గా జరుపాలని నిర్ణయించారట. ‘ఇంత చిన్న కార్యక్రమానికి ప్రధాని వెళ్లటం ఎందుకు.. ఆన్లైన్లో పూర్తి చేయండి’ అని కేంద్రంలోని పెద్దలు అధికారులతో పేర్కొన్నట్టు సమాచారం. కానీ.. ఆ తర్వాత తెలంగాణలో జరిగిన రెండు పరిణామాలు మోదీని ఆగమేఘాల మీద తెలంగాణకు వచ్చేలా చేశాయని, కల్పిత పర్యటనకు పురిగొల్పాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు పలు కారణాలను కూడా వీరు విశ్లేషిస్తున్నారు.
మొదటిది.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించిన ముగ్గురు దళారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం.. కేంద్రంలోని పెద్దలే ఈ కుట్ర వెనుక ఉన్నారని ఆధారాలు సహా బయటపడటం.. దేశవ్యాప్తంగా బీజేపీ నిజ స్వరూపం బట్టబయలు అవుతుండటం.. ఈ ఊహించని పరిణామం మోదీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. తనను ఎదురించిన సీఎం కేసీఆర్‌పై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకొన్నారు.
మోదీ రాకకు రెండో కారణం.. మునుగోడులో ఓటమి. రూ.వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినా, రూ.వందల కోట్లు ఖర్చు చేసినా, వేల మంది బీజేపీ శ్రేణులను మోహరించినా.. మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్‌కే పట్టం కట్టారు. ఈ ఓటమిని మోదీ జీర్ణించుకోలేకపోయారు. అందుకే హడావుడిగా తెలంగాణ పర్యటనకు ప్లాన్ చేశారు. కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని ‘మేకపోతు గాంభీర్యాన్ని’ ప్రదర్శించారు. ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం కేసీఆర్‌పై, రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు, పసలేని విమర్శలు చేశారు. రామగుండంలో నిర్వహించింది ప్రభుత్వ కార్యక్రమం. అక్కడా ‘హైదరాబాద్‌లో ఉన్నవాళ్లకు నిద్ర పట్టడం లేదు’ అంటూ చౌకబారు రాజకీయ విమర్శలు చేశారు. దీనిని బట్టే మోదీ కేవలం సీఎం కేసీఆర్‌ను తిట్టడానికే తెలంగాణలో ‘కల్పిత’ పర్యటనకు వచ్చినట్టు స్పష్టమవుతున్నది.