ఇల్లంతకుంట రూరల్, మే 19 : ‘కేసీఆర్ సార్.. మాకు మీరే దిక్కు.. ఈ సర్కార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పంటను కొనడం లేదు. అనేక అవస్థలు పడుతున్నాం. ఈ సర్కార్‌కు మీరే బుద్ధి చెప్పాలి. మిమ్మల్ని కలువడానికి వస్తు న్నాం’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పొద్దుతిరుగుడు రైతులు పేర్కొన్నారు. కేసీఆర్‌ను కలువనున్నట్టు రూపొందించిన పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. పొద్దుతిరుగుడు గింజలు కొనాలని రోడ్లపై ధర్నాలు, వంటావార్పు చేసినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదని ఇల్లంతకుంట మండలంలోని రైతులు వాపోతున్నారు.
పొద్దుతిరుగుడు గింజలు నెలన్నర రోజుల నుంచి ఇల్లంతకుంట మార్కెట్‌యార్డులోనే ఉన్నా కొనేవారు దిక్కులేరని ఆవేదన చెందుతున్నారు.దళారులకు అ మ్ముకొని క్వింటాల్‌కు రూ.1,700 చొప్పున నష్టపోతున్నామని చెప్తున్నారు. పంటకు గిట్టుబాటు ధరకావాలని కోరుతున్నారు. చివరి ప్రయత్నంగా కేసీఆర్ సార్‌ను కలిసి తమ బాధను పంచుకోనున్నట్టు తెలిసింది. కేసీఆర్ సార్.. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందని వారు భావిస్తున్నారు. రేపోమాపో కేసీఆర్ వద్దకు వందల సంఖ్యలో రైతులు తరలివెళ్లేందుకు సిద్ధమైనట్టు సమాచారం.