నిన్నటి వరకు కరెంటు, సాగునీరు కోసం తండ్లాడిన రైతు ఇప్పుడు విత్తనాల కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో జనుము విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయం వద్ద పొద్దెక్కకముందే బారులు తీరిన రైతులు.. కాంగ్రెస్ సర్కారులో కష్టాలకు నిదర్శనంగా నిలుస్తున్నారు.
షాబాద్, మే 22: ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకునేందుకు విత్తనాల కోసం రైతులు గోస పడుతున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి వ్యవసాయ కార్యాలయం ఎదుట జనుము విత్తనాల కోసం రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించారు. వానకాలం సీజన్‌కు జనుము విత్తనాలు పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న రైతులు.. తమకు విత్తనాలు దొరుకుతాయో లేదోనన్న ఆందోళనతో పెద్ద ఎత్తున వ్యవసాయ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడున్న అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆందోళనకు దిగారు. అదునుకు విత్తనాలు ఇవ్వకుంటే ఎలా అని అధికారులను నిలదీశారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి అండగా నిలిచేవారని గుర్తుచేసుకున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయాధికారి సురేశ్‌ను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. మండలానికి గత రెండు రోజుల క్రితం 40 క్వింటాళ్ల జనుము, 44 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు వచ్చాయని, మళ్లీ బుధవారం రోజున 110 క్వింటాళ్ల జనుము విత్తనాలు వచ్చాయని తెలిపారు. మొత్తం 350 మంది రైతులకు జనుము, జీలుగ విత్తనాలు పంపిణీ చేశామని, 60 క్వింటాళ్లు రావాల్సి ఉందని తెలిపారు.